క్రియేటివిటీ బయటపెడితే లోపలేశారు!..ఇంతకీ ఇతగాడుఏం చేశాడంటే?

క్రిస్మస్‌ వేడుకలు జరుపుకొని ఓ డ్రగ్‌ డీలర్‌ అడ్డంగా బుక్కయ్యాడు. అత్యుత్సాహానికి పోయి కటకటాలపాలయ్యాడు.......

Published : 31 Dec 2021 18:45 IST

లండన్‌: క్రిస్మస్‌ వేడుకలు జరుపుకొని ఓ డ్రగ్‌ డీలర్‌ అడ్డంగా బుక్కయ్యాడు. అత్యుత్సాహానికి పోయి కటకటాలపాలయ్యాడు. సహజంగానైతే అందరూ క్రిస్మస్‌ చెట్టుకు లైట్లు, స్టార్‌ గుర్తులు ఏర్పాటు చేసుకొని పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా.. ఏకంగా మాదకద్రవ్యాల పొట్లాలు, కరెన్సీ నోట్లతో క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫొటోలను గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.

మార్విన్‌ పోర్సెల్లీ అనే డ్రగ్‌ డీలర్ క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా.. వేలాది కొకైన్‌ ప్యాకెట్లతో ఇంట్లో క్రిస్మస్‌ చెట్టును ఏర్పాటుచేసుకున్నాడు. మధ్యమధ్యలో కరెన్సీ నోట్లు కూడా అలంకరించాడు. ఆ చెట్టును తన మొబైల్‌లో ఫొటో తీశాడు. అయితే ఎలాగోలా ఆ ఫొటోలు నార్త్‌వెస్ట్‌ ఇంగ్లాండ్‌ పోలీసుల దృష్టికి చేరాయి. వేట ప్రారంభించిన పోలీసులు డ్రగ్‌ డీలర్ మార్విన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘అధికంగా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు.. వారి అభిరుచి ఈ విధంగా బయటపడుతుంది’ అంటూ సరదా వ్యాఖ్యలు జోడించారు.

మార్విన్‌ పోర్సెల్లీని గతంలోనూ పోలీసులు డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. తాజాగా అతడికి మరికొందరు ముఠాతో కూడా సంబంధాలున్నట్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 1.3 మిలియన్‌ యూరోల (రూ.10.90 కోట్లు) విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. పలు మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మార్విన్‌తో సహా మిగతావారిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని