29 ఏళ్లు పాక్​ జైల్లో చిత్రహింసలు.. ఎట్టకేలకు స్వదేశానికి!

పాకిస్థాన్​ జైల్లో ఓ భారతీయుడు దశాబ్దాలపాటు చిత్రహింసలు అనుభవించాడు. దాయాది దేశం​లోని జైల్లో 29 ఏళ్లు మగ్గిపోయాడు......

Published : 28 Dec 2021 23:35 IST

దిల్లీ: పాకిస్థాన్​ జైల్లో ఓ భారతీయుడు దశాబ్దాలపాటు చిత్రహింసలు అనుభవించాడు. పొరపాటున సరిహద్దు దాటి.. దాయాది దేశం​లోని జైల్లో 29 ఏళ్లు మగ్గిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ జమ్ముకశ్మీర్​ వాసి ఈ నెల 24న స్వగ్రామమైన కథువాకి చేరుకున్నాడు. కాగా తన గ్రామంలో అతడికి ఘనస్వాగతం లభించింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు భారీగా చేరుకుని, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అయితే ఇన్నేళ్లు అక్కడ తాను పడ్డ కష్టాలను సదరు వ్యక్తి వివరించాడు.

పాక్‌ సరిహద్దుల్లోని కథువా గ్రామానికి చెందిన కుల్దీప్‌ సింగ్‌ 1992 డిసెంబర్​లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటాడు. దీంతో అక్కడి​ సైన్యం అతడిని అరెస్టు చేసింది. గూఢచర్యం కేసులో పాక్​ కోర్టులో విచారణలు కొనసాగాయి. నాలుగు విచారణలను ఎదుర్కొని కోట్​ లఖ్‌పత్​ జైల్లో 29 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఉత్తర ప్రత్యుత్తరాలు, భారత హైకమిషన్​ న్యాయపోరాటం అనంతరం కుల్దీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ డిసెంబర్​ 20న పంజాబ్‌లోని వాఘా సరిహద్దు గుండా అమృత్​సర్​ చేరుకున్నాడు. 24న తన స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబాన్ని మళ్లీ కలిసినందుకు ఆనందం వ్యక్తం చేశాడు​. ఇది తనకు మరో జన్మగా పేర్కొన్నాడు.

పాక్‌ జైళ్లలో భారతీయులను ఎలా హింసిస్తున్నారో కుల్దీప్‌ వివరించాడు. పాక్​ ఆర్మీ వలలో చిక్కిన ప్రతి భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తున్నారని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు. తనను కూడా బాగా ఇబ్బందిపెట్టారని తెలిపాడు. ఇరు దేశాలు మానవత్వంతో ఆలోచించి.. ఖైదీలందరినీ విడుదల చేయాలని కుల్దీప్‌ విజ్ఞప్తి చేశాడు. జమ్ముకశ్మీర్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ అక్కడి​ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. విడుదల కోసం చూస్తున్నారని వెల్లడించాడు. సైన్యం చేతిలో హింసలకు గురైన మరో 10-12 మంది భారతీయులు పాక్​లోని మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని