Jharkhand Judge Murder: ఉద్దేశపూర్వకంగానే.. ఝార్ఖండ్‌ జడ్జిపై దాడి..!

ఝార్ఖండ్‌లో జిల్లా న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తిపై దాడి జరిగినట్లు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) పేర్కొంది.

Updated : 23 Sep 2021 19:01 IST

ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెల్లడించిన సీబీఐ

రాంచీ: ఝార్ఖండ్‌లో జిల్లా న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తిపై దాడి జరిగినట్లు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) పేర్కొంది. ఘటన పునర్నిర్మాణం, సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన, 3డీ విశ్లేషణలతో పాటు ఫోరెన్సిక్‌ నివేదికలను బట్టి న్యాయమూర్తిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసేందుకు ఆటోతో దాడి చేశారని తెలిపింది. కేసు దర్యాప్తునకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో ఝార్ఖండ్‌ హైకోర్టుకు సీబీఐ మధ్యంతర నివేదికను అందించింది.

న్యాయమూర్తి హత్యకేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ప్రత్యేకంగా నాలుగు ఫోరెన్సిక్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆధారాలను విశ్లేషించిన గాంధీనగర్‌, దిల్లీ, ముంబయికి చెందిన ఫోరెన్సిక్‌ బృందాలు.. న్యాయమూర్తిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిపారనే నిర్ధారణ వచ్చినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు బ్రెయిన్‌ మ్యాపింగ్‌, నార్కో అనాలిసిస్‌ పరీక్షల ఫలితాలను కూడా సీబీఐ విశ్లేషిస్తోంది. ఈ హత్యకు సంబంధించి కుట్ర కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. అన్ని ఆధారాలను ధ్రువీకరించుకొని త్వరలోనే ఈ కేసు దర్యాప్తును పూర్తిచేస్తామని ఝార్ఖండ్‌ హైకోర్టుకు ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొంది.

ఇదిలాఉంటే, ధన్‌బాద్‌ జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను ఇద్దరు వ్యక్తులు ఆటోతో ఢీ కొట్టి హత్య చేశారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని ఝార్ఖండ్‌ ప్రభుత్వం సీబీఐకి తెలిపింది. ఈ కేసులో ఆటో డ్రైవర్‌ లఖాన్‌ వర్మ, అతనికి సహాయం చేసిన రాహుల్‌ వర్మలను ప్రధాన నిందితులుగా గుర్తించిన సీబీఐ.. దర్యాప్తును త్వరతగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని