Updated : 24 Nov 2021 12:43 IST

Shaurya Chakra: కుమారుడి గురించి చెప్తుంటే.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి..!

శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో ఓ మాతృమూర్తి ఆవేదన

దిల్లీ: ఈ ప్రపంచంలో ఏ తల్లిదైనా ఒకటే కోరిక.. తన పిల్లలు గొప్పగా ఎదగాలి.. తన కళ్లముందే సంతోషంగా ఉండాలి అని. అమ్మ కోరుకున్నట్లే జమ్మూకశ్మీర్ స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు బిలాల్ అహ్మద్ మాగ్రే. అయితే ఆ మాతృమూర్తి సారా బేగమ్‌కు మాత్రం ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఉగ్రవాదులు వారి కలల్ని చిదిమేశారు. 2019లో ఉగ్రమూకలపై జరిపిన ఆపరేషన్‌లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు అహ్మద్. దీంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. ఆయన దేశం కోసం నిస్వార్థంగా చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. మూడో అత్యున్నత శౌర్య పురస్కారం శౌర్యచక్రను ప్రకటించింది. నిన్న రాష్ట్రపతి భవన్‌లో ఆ అవార్డు అందుకునే క్రమంలో.. ఆ తల్లి తల్లడిల్లిన తీరు ప్రతిఒక్కర్నీ కంటతడి పెట్టించింది.

‘ఒక ఇంటిలో చిక్కి ఉన్న పౌరుల్ని రక్షించేందుకు, ఉగ్రవాదులన్ని మట్టుబెట్టే ఆపరేషన్‌ నిమిత్తం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బిలాల్ అహ్మద్ మాగ్రే. పౌరులను కాపాడే క్రమంలో ఆయనతో పాటుగా అక్కడే ఉన్న ఇతర సిబ్బందిపై.. నక్కి ఉన్న ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా హ్యాండ్ గ్రెనేడ్లు విసిరాడు. కాల్పులకు పాల్పడ్డాడు. ఆ ఘటనలో మాగ్రేతో పాటు మరో అధికారి, ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. అంత గాయపడినప్పటికీ మాగ్రే తన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పౌరులందరినీ ఆ ఇంటి నుంచి బయటకు తరలించారు’ అంటూ అవార్డు ఇచ్చే ముందు మాగ్రే చేసిన సేవ గురించి.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర అతిథుల సమక్షంలో వివరణ వినిపించింది. అవార్డు తీసుకునేందుకు అక్కడే నిలబడి ఉన్న ఆ తల్లి.. ఆ మాటలు చెప్తున్నంత సేపు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బిగ్గరగా ఏడ్వలేక, ఆ బాధను గుండెల్లో దాచుకోలేక కుమిలిపోయారు. ఆమె పరిస్థితి అక్కడున్నవారిని కదిలించింది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆ మాతృమూర్తి చెంతకు వచ్చి శౌర్యచక్రను ప్రదానం చేశారు.

తన కుమారుడు దేశం కోసం చేసిన సేవల్ని గుర్తుకు తెచ్చుకున్న ఆ తల్లి తనను తాను ఓదార్చుకునే ప్రయత్నం చేసింది. తిరిగి వేళ్లే క్రమంలో అక్కడ కూర్చున్న పెద్దలందరికి నమస్కారం చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని