Joe Biden : అఫ్గాన్‌ నుంచి పౌరులను తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ

అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 Aug 2021 09:37 IST

చాలా కఠినమైన పరిస్థితుల్లో మా బలగాలు పనిచేస్తున్నాయి


వాషింగ్టన్‌ : అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌లో అమెరికా పౌరల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. అఫ్గాన్‌ నుంచి పౌరులను తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

‘అఫ్గాన్‌ నుంచి వాయు మార్గంలో తరలింపు అతి క్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుంది. అఫ్గాన్‌లో చాలా కఠినమైన పరిస్థితుల్లో మా బలగాలు పనిచేస్తున్నాయి. కాబూల్‌ విమానాశ్రయంలో మా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంది. విమానాశ్రయం వద్ద 6 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మిలటరీ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్‌ ఫ్లైట్లు ఉన్నాయి. పౌరులను తరలించేందుకు ఈ విమానాలు ఉపయోగపడతాయి. జులై నుంచి ఇప్పటికే 18 వేల మందిని తరలించాం. ఆగస్టు 14 నుంచి సైనిక విమానాల్లో 13 వేల మందిని తరలించాం’ అని బైడెన్‌ అన్నారు. 

కాబుల్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రక్రియలో జాప్యం జరుగుతున్న క్రమంలో.. అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు. కాబుల్‌ నుంచి అమెరికన్లందర్నీ క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని అభయమిచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన శ్వేతసౌధం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘కాబుల్‌లో కనిపిస్తున్న దృశ్యాలను చూడాలని ఎవరూ అనుకోరు. మానవమాత్రులెవరూ వాటిని జీర్ణించుకోలేరు. అక్కడి విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న వారిని తీసుకొస్తాం’’ అని అన్నారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

మరోవైపు- అఫ్గాన్‌ నుంచి అమెరికా ఈనెల 31 లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఈ విషయాలపై బైడెన్‌.. జాతీయ భద్రతాధికారుల బృందంతో చర్చించినట్టు సమాచారం. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించవచ్చని; అమెరికా బలగాలకు సహకరించిన అఫ్గాన్ల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని హెచ్చరిస్తూ... అఫ్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు గత నెలలోనే యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. అయినా, ఇప్పటికీ ఈ ప్రక్రియ వేగవంతం కాలేదు! మరోవైపు... ‘‘కాబుల్‌ విమానాశ్రయం నుంచి ఎంతమంది అమెరికన్లు, అఫ్గాన్లను తరలించాల్సి ఉందో స్పష్టంగా తెలియడం లేదు. వారందర్నీ సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని శ్వేతసౌధం జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సులివాన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని