Updated : 22/08/2021 19:22 IST

Kalyan Singh: కల్యాణ్‌ సింగ్‌ - ప్రజల విశ్వాసానికి చిహ్నం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ (89) విలువైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే కాకుండా సాధారణ ప్రజల ‘విశ్వాసానికి చిహ్నం’గా నిలిచిన సమర్థుడైన నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం లఖ్‌నవూలోని కల్యాణ్‌ సింగ్‌ నివాసానికి చేరుకున్న మోదీ.. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.

‘ఓ విలువైన, సమర్థుడైన నాయకుడిని దేశం కోల్పోయింది. కల్యాణ్‌సింగ్ ఆదర్శాలు, వాగ్దానాలతోపాటు ఆయన కన్న కలలను సాకారం చేయడం కోసం శాయశక్తులా కృషి చేస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘కల్యాణ్‌సింగ్‌’గా ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరుకు అనుగుణంగానే జీవితం మొత్తం ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వంలో ఏ స్థాయిలోనైనా, గవర్నర్‌గా.. ఇలా ఆయన చేపట్టిన అన్ని బాధ్యతల్లోనూ ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని ప్రధాని మోదీ కీర్తించారు. ప్రధాని వెంట భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక కొద్ది వారాలుగా తీవ్ర అనారోగ్యంతో లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందిన కల్యాణ్‌ సింగ్‌ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. కల్యాణ్ సింగ్ భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఆరెస్సెస్‌తో ఎనలేని అనుబంధం ఉన్న కల్యాణ్‌ సింగ్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌లో కమల దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. 1932 జనవరి 5న జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలలు జైల్లో ఉన్నారు. 1992 డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన సమయంలో ఆయనే యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో అత్యంత వివాదాస్పద అంశం అదే. ఆందోళనకారులపై కాల్పులు జరపవద్దని అప్పట్లో ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తర్వాత తన చర్యను సమర్థించుకున్నారు. అయితే కూల్చివేతకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. రామమందిర నిర్మాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కల్యాణ్‌సింగ్‌.. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతను పలుమార్లు సమర్థించుకున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని