Kamala Harris: ఆసియా పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌..!

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితుల నెలకొన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆసియాలో పర్యటన చేపట్టారు.

Published : 22 Aug 2021 23:20 IST

అఫ్గానిస్థాన్‌లో సంక్షోభ సమయంలో కీలకంగా మారిన పర్యటన

సింగపూర్: అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆసియాలో కీలక పర్యటన చేపట్టారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సింగపూర్‌లో దిగిన కమలా హారిస్‌.. అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రితో కమలా హారిస్‌ భేటీ కావడంతో పాటు అమెరికా నావికా విభాగం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం మంగళవారం సాయంత్రం కమలా హారిస్‌ వియత్నాం చేరుకుంటారు. అయితే, ఆఫ్గాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ.. కమలా హారిస్ ఆసియా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

‘తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంత దేశాలకు భరోసా కల్పించడంలో అమెరికా ఉపాధ్యక్షురాలు చేస్తోన్న ఈ పర్యటన ఎంతో దోహదపడుతుంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో రాజకీయంగా, నావికా పరంగా చైనా ఆధిపత్యం ఓ సవాలుగా మారింది. చైనాతో పొంచివున్న ఈ ముప్పును ఎదుర్కోవడంతో పాటు చైనా ప్రాబల్యాన్ని తగ్గించడంలో వ్యూహాత్మకంగా, ఆర్థికంగానూ ఈ ప్రాంతం అమెరికాకు ఎంతో ముఖ్యమైనది’ అని వైట్‌హౌస్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. తాజాగా అఫ్గానిస్థాన్‌ పరిణామాలను ఇదే విధంగా చూస్తున్నామన్నారు. ఈ ప్రాంతంపై అమెరికాకు నిబద్ధత ఉందన్న విషయాన్ని ఉపాధ్యక్షురాలు తన పర్యటనలో స్పష్టం చేస్తారని వైట్‌హౌస్‌ అధికారి వెల్లడించారు.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. బలగాలను వెనక్కి పిలిపించడంలో అధ్యక్షుడు సరిగా వ్యవహరించలేదనే వాదన ఉంది. ఇదే సమయంలో అఫ్గాన్‌ నుంచి అమెరికన్లతో పాటు ఇతర దేశాల పౌరులను తరలించడంలో అమెరికా సైన్యం జాప్యం చేస్తోందనే విమర్శలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ తాలిబన్‌ ఆక్రమిత అఫ్గాన్‌ నుంచి అమెరిక్లను, మిత్ర దేశాల వారిని తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభయమిచ్చారు. ఇక అఫ్గాన్‌పై మునుపటి అమెరికా ప్రభుత్వం, ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులకు కారణమైన వివిధ అంశాలకు సంబంధించి.. ఈ ప్రాంతంలో విశ్వసనీయతను పెంపొందించుకోవడం అమెరికాకు ఎంతో అవసరమని సింగపూర్‌లో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ముస్తఫా ఇజుద్దీన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని