Modi: మోదీ పర్యటనలో భద్రతా లోపం..కంగన పరుష వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యవసర ప్రణాళికలో భాగంగా రోడ్డు మార్గంలో ప్రయాణించేప్పుడు అదనపు భద్రత కల్పించాల్సి ఉన్నా పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది.

Updated : 06 Jan 2022 19:52 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యవసర ప్రణాళికలో భాగంగా రోడ్డు మార్గంలో ప్రయాణించేప్పుడు అదనపు భద్రత కల్పించాల్సి ఉన్నా పంజాబ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ఈ ఘటనపై భాజపా వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, దీనిపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.

‘ప్రధాని పర్యటనలో భాగంగా పంజాబ్‌లో జరిగింది సిగ్గుచేటు చర్య. ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు. 140 కోట్ల ప్రజానీకానికి ప్రతినిధి.. ఆయనపై దాడి అంటే అది ప్రతి ఒక్క భారతీయుడిపై దాడి వంటిదే. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి. పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వెంటనే వాటిని అరికట్టకపోతే.. దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అంటూ ఇన్‌స్టాగ్రాం వేదిగా కంగన పరుష వ్యాఖ్యలు చేశారు. bharatstandswithmodiji అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు. 

మోదీ పంజాబ్‌ పర్యటనలో నెలకొన్న అవాంతరంపై నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ చన్నీ స్పందించారు. మోదీ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలూ లేవని చన్నీ స్పష్టంచేశారు. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించడం వల్లే ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనడం సరికాదని పేర్కొన్నారు. ‘‘ఆయన (ప్రధాని మోదీ) భఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు ముందు వాయు మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించడంతో ఈ విధంగా జరిగింది. రాజకీయ కారణాలతోనే  పంజాబ్‌ ప్రభుత్వంపై భాజపా లేనిపోని ఆరోపణలు చేస్తోంది’ అని చన్నీ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని