
ఒమిక్రాన్ కలకలం.. కేంద్ర ఆరోగ్యమంత్రితో కర్ణాటక సీఎం భేటీ!
దిల్లీ: దేశంలోనే తొలిసారి కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. మంత్రితో సమావేశమై కొత్త వేరియంట్ వ్యాప్తి కట్టడిపై చర్చించారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు పంపిణీ అంశంపై మాండవీయతో చర్చించానన్నారు. ప్రస్తుత పరిణామాలను కేంద్రం గమనిస్తోందనీ.. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు పంపిణీ చేసే అంశంపై నిపుణుల కమిటీలతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తనతో అన్నారని బొమ్మై వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్యమంత్రితో కరోనా కట్టడి, కొత్త వేరియంట్.. ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చించానని సీఎం అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో తమ రాష్ట్రాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారని తెలిపారు. ఇదే వేగాన్ని మున్ముందు కొనసాగించాలని సూచించారన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత అంశాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. కర్ణాటకలో డీఏపీ డిమాండ్‌ను తీర్చేలా చూస్తామని భరోసా ఇచ్చారన్నారు. అనంతరం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిసిన సీఎం బసవరాజ బొమ్మై.. తమ రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా హస్తినకు విచ్చేసిన బొమ్మై.. ఈ రాత్రికి బెంగళూరు చేరుకొనే అవకాశం ఉంది.
► Read latest National - International News and Telugu News