Kejriwal: ఒమిక్రాన్‌కు భయపడకండి.. ఇవి మాత్రం మరవకండి!

దేశ రాజధాని నగరంలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ఎవరూ భయపడొద్దన్నారు......

Published : 06 Dec 2021 15:48 IST

దిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్‌ హెచ్చరిక

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ఎవరూ భయపడొద్దన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనా కొత్త వేరియంట్‌ కేసు దిల్లీలో నిన్న వెలుగుచూసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. పడకలు, ఔషధాలతో పాటు వైరస్‌ కట్టడికి అవసరమైన వసతులు అందుబాటులో ఉంచడంపై సమీక్షించినట్టు పేర్కొన్నారు. ‘‘ఒమిక్రాన్‌ దేశంలోకి ప్రవేశించింది. దిల్లీ సహా అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. ఈ సందర్భంలో ప్రజలెవరూ భయపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. భౌతికదూరం పాటించండి.. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి’’ అని సూచించారు.

దేశ రాజధాని నగరం దిల్లీలో ఆదివారం ఒమిక్రాన్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. టాంజానియా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ ఉన్నట్టు తేలింది. ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయాలంటూ  కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు, ఒమిక్రాన్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. ఇప్పటివరకు 27మందిని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించామన్నారు. వారిలో 17మందికి పాజిటివ్‌గా తేలగా.. 10 మంది వారికి దగ్గరగా కాంటాక్టు అయినవారని చెప్పారు. 12మంది జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు సంబంధించిన రిపోర్టులు రాగా.. వారిలో ఒకరికి పాజిటివ్‌గా తేలినట్టు వివరించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని