Omicron: కేరళలోనూ రాత్రి కర్ఫ్యూ.. 10 దాటితే సెలబ్రేషన్స్‌ బంద్‌!

ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతుండటంతో కేరళ ప్రభుత్వం సైతం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది.....

Published : 27 Dec 2021 23:30 IST

తిరువనంతపురం: ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతుండటంతో కేరళ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 2 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ 31న రాత్రి 10 దాటిన తర్వాత బయట ఎలాంటి సెలబ్రేషన్లు, గుంపులుగా చేరవద్దని పేర్కొనింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సైతం నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధన అమలుకానుంది. ఈరోజు రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఆదివారమే ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. హోటళ్లు, బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్‌కే అనుమతి ఉంటుందని, థియేటర్లలో రాత్రి 10 గంటల్లోగా సినిమా ప్రదర్శనలను ముగించేలా చర్యలు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది.

దేశ రాజధాని దిల్లీలోనూ నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దిల్లీలో కొవిడ్‌ కేసుల పెరగడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు కర్ఫ్యూ, ఇతర నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సైతం ఈ దిశగానే పయనించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని