Omicron: కేరళలో తొలి ఒమిక్రాన్‌ కేసు.. దేశంలో మొత్తం ఎన్నంటే..!

కేరళలో తొలి ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయ్యింది.....

Published : 12 Dec 2021 23:25 IST

తిరువనంతపురం: కేరళలో తొలి ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయ్యింది. సదరు వ్యక్తి బ్రిటన్‌ నుంచి అబుదాబి మీదుగా ఈ నెల 6న ఎర్నాకుళం చేరుకున్నాడు. కాగా అతడికి పరీక్షలు నిర్వహించగా డిసెంబర్‌ 8న కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ‘కేరళలో ఒమిక్రాన్‌ కేసు బయటపడింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తికి మొదట పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా వచ్చింది. 8వ తేదీన మళ్లీ పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విమానంలో అతనితోపాటు వచ్చిన మొత్తం 149 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశాం’ అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. బాధితుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని పేర్కొన్నారు.

దీనిపై మరింత సమాచారం అందిస్తూ..‘అతడి భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వారిని ఐసోలేషన్‌లో ఉంచాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వారి క్లోజ్‌ కాంటాక్ట్‌లను గుర్తించాం. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని జార్జ్ తెలిపారు. తాజా కేసుతో దేశంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 38కి చేరింది. ఈ రోజు మొత్తంగా 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, చండీగఢ్‌, మహారాష్ట్రలో ఒక్కో కేసు సహా.. తాజాగా కేరళలో ఒకటి బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని