Lakhimpur Kheri: లఖింపుర్ ఖేరి ఘటన.. ప్రణాళికాబద్ధమైన కుట్ర..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ.. ప్రణాళికాబద్ధమైన కుట్రని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది.

Updated : 14 Dec 2021 14:51 IST

వెల్లడించిన సిట్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ.. ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడు. ఆశిశ్ మిశ్రాపై నమోదైన అభియోగాలను సవరించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు, తదితరులు హత్య, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు హత్యా ప్రయత్నం, ఇతర అభియోగాలను జోడించాలని ఆ లేఖలో కోరారు.

లఖింపుర్‌లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో రైతులపైకి ఎస్‌యూవీ వాహనం వేగంగా దూసుకెళ్లినట్లు కనిపించింది. ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలని విపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేశాయి. కాగా, ఈ కేసు విచారణపై సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరితగతిన కొలిక్కి తేవాలని గత నెల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. రైతులు వ్యతిరేకించిన సాగు చట్టాల రద్దు బిల్లులు ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని