Kim: స్లిమ్‌గా కిమ్‌ ఎలా మారాడు?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన పాలిస్తున్న దేశం గురించి ప్రతివార్తా ఆసక్తికరంగానే ఉంటుంది. గత కొద్దికాలంగా కిమ్ ఆరోగ్యం, ఆయన స్లిమ్‌గా మారడం గురించే వార్తలు వస్తున్నాయి.

Published : 04 Jan 2022 01:59 IST

ఇంకా స్లిమ్‌గా మారిన ఉత్తర కొరియా అధినేత

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన పాలిస్తున్న దేశం గురించి ప్రతివార్తా ఆసక్తికరంగానే ఉంటుంది. గత కొద్దికాలంగా కిమ్ ఆరోగ్యం, ఆయన స్లిమ్‌గా మారడం గురించే వార్తలు వస్తున్నాయి. ఇటీవల అక్కడ మీడియా విడుదల చేసిన ఫొటోలు చూస్తుంటే ఆయన మరింత సన్నగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

దీనిపై అక్కడి అధికారులు మాట్లాడుతూ..‘అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. దేశం కోసం ఆయన తక్కువగా తింటున్నారు’ అని వెల్లడించారని మీడియా కథనం పేర్కొంది.  ప్రస్తుతం ఉత్తర కొరియా ఆహార కొరతతో అలమటిస్తోంది. కరోనా వైరస్‌ కట్టడికి సరిహద్దుల వెంబడి కఠిన ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆ దేశ అణుకార్యక్రమంపై అంతర్జాతీయ నిబంధనలు.. కిమ్ సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటి వల్ల ఆహార లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో ప్రజలంతా తక్కువ తినాలంటూ కిమ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఇక గత ఏడాదిలో కూడా కిమ్ సన్నబడిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 20 కేజీల బరువు తగ్గి కనిపించడంతో.. అందుకు అనారోగ్యం కారణమనే వార్తలు వినిపించాయి. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, శరీరాకృతి కోసం చేసిన ప్రయత్నాల వల్ల సన్నబడి ఉండొచ్చని మరో కథనం పేర్కొంది.  అయితే అప్పటికే ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే.. తమ అధినేత సన్నగా మారిన దృశ్యాలను చూసి ప్రజల హృదయాలు ఎంతగానో కలత చెందాయంటూ అధికారిక మీడియా సంస్థ రాసుకొచ్చింది.  

తాను పగ్గాలు చేపట్టి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కిమ్ మాట్లాడారు. మామూలుగా అమెరికా, దక్షిణకొరియా గురించి మాట్లాడే కిమ్.. ఈసారి ప్రజల  జీవన ప్రమాణాలు, ట్రాక్టర్ ఫ్యాక్టరీలు, పాఠశాల యూనిఫాంలు, అభివృద్ధి గురించి ప్రస్తావించారు. దేశం జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. ప్రజలంతా కఠిన పరిస్థితులు అనుభవిస్తోన్న సమయంలో..  తన సైనిక ప్రణాళిక గురించి మాట్లాడటం మంచి ఆలోచన కాదని కిమ్ భావించి ఉండొచ్చంటూ కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని