Updated : 03 Sep 2021 19:24 IST

Kim Style: టీకాల తిరస్కరణ.. ‘సొంత స్టైల్‌లోనే’ కరోనాపై పోరు!

కొవాక్స్‌ కూటమి టీకాలను తిరస్కరించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

సియోల్‌: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీకి తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మాత్రం తన రూటే సపరేటు అంటోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌లను అందిస్తామని ముందుకొచ్చిన కొవాక్స్‌ కూటమికి ‘నో’ చెప్పిన ఉత్తర కొరియా నియంత కిమ్‌.. సొంత స్టైల్‌లోనే కొవిడ్‌పై పోరును కొనసాగిస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించినప్పటికీ ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశం ప్రకటిస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దేశంలోకి మహమ్మారి ప్రవేశించకుండా కఠిన నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైన పని.. గుర్తుంచుకోండి.. ఒక్క క్షణం కూడా అలసత్వం వహించకూడదు’ అంటూ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ అక్కడి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముఖ్యమైన, సాంకేతిక మార్గాలను అనుసరించడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇలా కొవిడ్‌ నిర్మూలన, కట్టడి చర్యలను తమదైన స్టైల్‌లోనే చేపట్టాలని కిమ్‌ అధికారులకు స్పష్టం చేశారు.

కొవాక్స్‌ చేయూత..

కరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కూటమి వ్యాక్సిన్‌లను సమకూర్చి ఆయా దేశాలకు సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా యునిసెఫ్‌ 30లక్షల సినోవాక్‌ డోసులను ఉత్తర కొరియాకు అందించేందుకు ముందుకు వచ్చింది. కానీ, దీన్ని తిరస్కరించిన కిమ్‌.. వీటిని ప్రస్తుతానికి ఇతర దేశాలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అయితే, సినోవాక్ సమర్థతపై అనుమానాలు ఉండడం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతోందనే వార్తల కారణంగానే ఉత్తర కొరియా వీటిని తిరస్కరించిదనే వాదన కూడా ఉంది. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా సమర్థవంతమైన వ్యాక్సిన్‌ పొందాలని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోందని.. లేదా నేరుగా చైనా నుంచి వ్యాక్సిన్‌ను సేకరించే అవకాశం ఉందని సియోల్‌లోని ఎవ్‌హా వుమెన్స్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లీఫ్‌-ఎరిక్‌ ఈస్లీ పేర్కొన్నారు. సురక్షిత వ్యాక్సిన్‌లనే తమ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కిమ్‌ జోంగ్‌ ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

కొనసాగుతోన్న సరిహద్దు ఆంక్షలు..

దేశంలో మహమ్మారి చొరబడకుండా ఉండేందుకు ఉత్తర కొరియా అధినేత తీవ్ర ఆంక్షలను కొనసాగిస్తున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడంతో పాటు ఆహార కొరత ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ సరిహద్దుల మూతతో పాటే కొవిడ్‌ ఆంక్షలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో దేశ పౌరులు సహకరించాలని ఉత్తరకొరియా అధినేత ఇదివరకే విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఉత్తర కొరియాలో నెలకొన్న మానవ హక్కుల పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ కట్టడి చర్యలు కొనసాగిస్తూనే ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఉత్తర కొరియాకు సూచించారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించే ప్రణాళిక రూపొందించడంతో పాటు ఇతర దేశాల రాయబార సిబ్బందిని అనుమతించాలని కోరారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని