Polluted city: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం నగరం ఏ దేశంలో ఉందంటే..?

పాకిస్థాన్‌ నగరం లాహోర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది.

Updated : 18 Nov 2021 06:58 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ నగరం లాహోర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఆ నగరంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయి(300 కంటే ఎక్కువ)లో ఉందని, పొగమంచు కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వెల్లడించింది. కాలుష్య తీవ్రతను లెక్కించి 348 వ ర్యాంకును కేటాయించింది. 

నాణ్యత లేని ఇంధనాలను మండించడం, పంట వ్యర్థాల దహనం, శీతకాల ఉష్ణోగ్రతలు మూలానా గత కొద్ది సంవత్సరాలుగా పాక్‌లో గాలి కాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది.  పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన లాహోర్ నగరం కాలుష్యపరంగా చెత్త నగరాల జాబితాలో కొనసాగుతోంది. దాంతో అక్కడి ప్రజలు సొంతంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్య తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మరికొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే తమ పరిస్థితికి కారణం భారత్‌లో నెలకొన్న పొగమంచు అని, కాలుష్య గణాంకాలను మరీ ఎక్కువ చేసి చూపుతున్నారని అక్కడి ప్రభుత్వం సాకులు చెప్తూ.. అలసత్వం ప్రదర్శిస్తోంది.

కాగా తమ పరిస్థితిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని, ఆసుపత్రుల్లో చూపించుకునే స్థోమత తమకు లేదని వాపోతున్నారు. అప్పట్లో తనతో పాటు పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్లేవాడినని, ఇప్పుడు వారిని తనవెంట తీసుకెళ్లాలంటే భయం వేస్తుందని రోజుకూలీగా పనిచేసే సయీద్ వెల్లడించారు. చిన్నారుల్లో శ్వాస సంబంధ సమస్యలు వెలుగుచూస్తున్నాయని, దీనికి వెంటనే ఒక పరిష్కారం కనుగొనాలని మరోవ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని