
Lakhimpur Kheri: మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపుర్ కేసు దర్యాప్తు
లఖ్‌నవూ: లఖింపుర్ ఖేరి ఘటనపై దర్యాప్తును హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో జరిపేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా యూపీ ప్రభుత్వం సిఫారసు చేయాలని పేర్కొంది.
లఖింపుర్ కేసుపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని.. ఉత్తరప్రదేశ్‌కు చెందని, హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ పేర్లను ఇందుకు సిఫారసు చేసింది. కాగా దీనికి తాము అంగీకరిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం సోమవారం కోర్టుకు తెలిపింది. అయితే వీరితో పాటు మరికొందిరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని, తీర్పు బుధవారం వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది.
ఇదీ కేసు
అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. క్రైం బ్రాంచ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.