Malaysian PM resigns: మలేసియా ప్రధాని ముహిద్దీన్‌ యాసిన్‌ రాజీనామా!

మలేసియాలో గతకొన్ని నెలలుగా సాగుతోన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైన నేపథ్యంలో మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ పదవికి రాజీనామా చేశారు.

Published : 16 Aug 2021 22:50 IST

కౌలాలంపూర్‌: మలేసియాలో గతకొన్ని నెలలుగా సాగుతోన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైన నేపథ్యంలో మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రధాని రాజీనామాకు మలేసియా రాజు అల్‌-సుల్తాన్‌ అబ్దుల్లా ఆమోదం తెలిపారు. కొత్త ప్రధానిని నియమించేవరకు ముహిద్దీన్‌ యాసిన్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని.. మెజారిటీ పొందగలిగే కొత్త ప్రధానిని నియమిస్తానని మలేసియా రాజు అల్ సుల్తాన్‌ వెల్లడించారు.

మలేసియా ప్రధానిగా ముహిద్దీన్‌ యాసిన్‌ 2020లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ప్రభుత్వంలో అంతర్గత పోరు ఓవైపు.. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ, ఆర్థికవ్యవస్థ క్షీణించడం వంటి సవాళ్లు ప్రధాని యాసిన్‌కు తలనొప్పిగా మారాయి. ఇలా గడిచిన 18 నెలలుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నప్పటికీ పార్లమెంటులో మాత్రం యాసిన్‌ మెజారిటీ సంపాదించలేకపోయారు. దీంతో తనతో పాటు కేబినెట్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని యాసిన్‌ వెల్లడించారు. స్వల్ప కాలంలోనే రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణ కోరిన ఆయన.. అధికారం కోసం ఆరాటపడుతోన్న వారిపై మండిపడ్డారు.

ఇదిలాఉంటే, మలేసియాలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ అధికంగా ఉన్న దేశాల్లో మలేసియా నిలిచింది. గడిచిన ఏడు నెలల నుంచి నిత్యం అక్కడ 20వేలకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. లాక్‌డౌన్‌ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ కొవిడ్‌ కట్డడిలో ప్రభుత్వం విఫలమైందని ప్రజల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైన ముహిద్దీన్‌ యాసిన్‌.. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని