Pegasus: పెగాసస్‌పై దర్యాప్తునకు మమతా సర్కార్‌ ఆదేశం!

దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో పలువురి ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది.

Published : 26 Jul 2021 19:48 IST

ఇద్దరు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో పలువురి ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాఛార్యల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పెగాసస్‌ స్పైవేర్‌ జాబితాలో మమతా బెనర్జీ అల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన తరుణంలో మమతా సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత దీనిపై ఓ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

‘హ్యాకింగ్‌ వ్యవహారం, అసలు ఇది ఏవిధంగా జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించాం. ఈ చిన్న చర్య ఇతరులకు మేల్కొలుపు అవుతుందని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా న్యాయం జరగాలన్నదే మా కోరిక. బెంగాల్‌లో చాలా మంది హ్యాకింగ్‌కు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని భావించినప్పటికీ.. దర్యాప్తుపై ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. అందుకే దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, దేశంలో ప్రముఖుల ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ జాబితాలో ఉన్నాయంటూ ఈమధ్యే వచ్చిన నివేదికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీటిలో దాదాపు 300 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ స్పైవేర్‌ సాంకేతికత సహాయంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు గూడఛర్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేస్తున్నాయి. ఇదే సమయంలో వీటిపై దర్యాప్తు చేపట్టాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని