Mamata Banerjee: ఇంట్లో కొవిడ్‌ పేషెంట్‌.. బయట చక్కర్లు కొడుతున్న సీఎం సోదరుడు!

ఇంట్లో ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ అయినప్పటికీ.. తన సోదరుడు మాత్రం బహిరంగంగా  బయట తిరుగుతున్నాడని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు.

Published : 07 Jan 2022 01:44 IST

సోదరుడిని మందలించానన్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోన్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ పదే పదే హెచ్చరిస్తోంది. అయినప్పటికీ కొంతమంది కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా ఓ ముఖ్యమంత్రి సోదరుడు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నట్లు వెల్లడైంది. ఇంట్లో ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ అయినప్పటికీ.. తన సోదరుడు మాత్రం బహిరంగంగా  బయట తిరుగుతున్నాడని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతోన్న సమయంలో ఇంట్లోని వారే కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం పట్ల ఆయన్ను మందలించానని అన్నారు.

‘మీ ఇంట్లో ఎవరైనా కొవిడ్‌ బారినపడితే మరిచిపోయి మీరు బయట తిరగకండి. మా ఇంట్లో ఓ వ్యక్తి అలాగే చేశారు. అందుకు నేను చింతిస్తున్నాను. నా సోదరుడి భార్యకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కానీ, నా సోదరుడు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్నాడు. నాకది నచ్చలేదు. దీంతో రేపటినుంచి ఎక్కడికీ వెళ్లవద్దని మందలించాను. నేను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిని.. గుర్తుపెట్టుకోండి’ అంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. 7 రోజుల ఐసోలేషన్‌ గడువు ముగిసిన తర్వాత కూడా తాను కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటిస్తానన్నారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయవద్దని.. మాస్కులు ధరిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని మమతా బెనర్జీ సూచించారు.

గత కొన్నిరోజులుగా పశ్చిమ బెంగాల్‌లో కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 14వేలకు చేరుకుంది. ముఖ్యంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగింది. ఇదే సమయంలో తన కుటుంబంలోనే ఒకరికి వైరస్‌ నిర్ధారణ అయినప్పటికీ తన సోదరుడు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయట తిరుగుతున్నాడని తెలిసి బాధపడినట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇక కొవిడ్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోన్న సమయంలో వచ్చే 15రోజులు ఎంతో కీలకమన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని మమతా బెనర్జీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని