
Mansukh Mandaviya: కేంద్ర మంత్రి.. సైకిల్‌పై సమావేశానికి..!
ట్రేడ్ఫెయిర్లో పాల్గొన్న మన్సుఖ్ మాండవీయ
దిల్లీ: కేంద్రమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సైకిల్‌పై ప్రయాణించేందుకే ఎక్కువ శ్రద్ధ చూపుతారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. తాజాగా దిల్లీలో జరిగిన ఓ ట్రేడ్ ఫెయిర్‌కు సైకిల్‌పైనే వెళ్లారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) కు హాజరైన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన ఆరోగ్యశాఖ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన మన్సుఖ్ మాండవీయ, సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడించారు.
‘మనకు ఆరోగ్యం అనేది వ్యాపారం కాదు. కానీ, సంపూర్ణ ఆరోగ్యం కోసం మాత్రం ప్రజలకు మంచి వసతులు కల్పించాలి. ఆరోగ్యశాఖ తరపున కోరుకుంటున్నది ఇదే. ఇందులో భాగంగానే ఫిట్ ఇండియా, యోగా, ఖేలో భారత్ వంటి కార్యక్రమాలను తీసుకువచ్చాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఏర్పాటు చేసిన ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లు కేంద్రఆరోగ్య వ్యవస్థకు వెన్నెముక అని అభిప్రాయపడ్డారు. ఇక నిర్మూలించదగిన వ్యాధులపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామన్న ఆయన.. దేశంలో వైద్యుల సంఖ్యను పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో కలిగే అపోహలను తొలగించడంతోపాటు అసత్య ప్రచారాల నిర్మూలనకు మీడియా కృషిని మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 113 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వివరించారు. ఇదిలాఉంటే, కేంద్రమంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవీయ.. వీలైనప్పుడల్లా తన కార్యాలయానికి, పార్లమెంటు సమావేశాలకు కూడా సైకిల్‌పైన వెళ్లడానికే ఇష్టపడతారు.