Mansukh Mandaviya: మాండవీయా.. మీకు ధన్యవాదాలు: డబ్ల్యూహెచ్‌ఓ

భారత ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు బుధవారం ఉదయం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి కృతజ్ఞతలు లభించాయి. అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం మాండవీయ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. 

Updated : 22 Sep 2021 16:17 IST

దిల్లీ: భారత ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు బుధవారం ఉదయం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి కృతజ్ఞతలు లభించాయి. అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం మాండవీయ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. 

కరోనా టీకా ఉత్పత్తిలో ముందువరుసలో ఉన్న భారత్.. దేశంలో టీకాలు అందుబాటులోకి వచ్చిన సమయంలోనే పలు దేశాలకు ఎగుమతి చేసింది. మరికొన్ని దేశాలకు టీకాలను విరాళంగా ఇచ్చి ఉదారతను చాటుకొంది. అయితే ఏప్రిల్‌లో కరోనా రెండో దశ ప్రారంభం కావడంతో భారత్‌ వ్యాక్సిన్ మైత్రికి బ్రేక్ పడింది. అప్పటి నుంచి స్వదేశంలోని టీకా కార్యక్రమంపైనే దృష్టిపెట్టింది. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో టీకాలు అందిస్తూ.. కేంద్రం విధించుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మిగులు టీకాలను అక్టోబర్ నెల నుంచి ఎగుమతి చేస్తామని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను వ్యాక్సిన్ మైత్రి, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ట్విటర్ వేదికగా స్పందించారు.

‘అక్టోబర్‌లో కొవాక్స్‌కు భారత్ తిరిగి కొవిడ్ టీకాలు అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆ దేశ ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ దేశాల్లో 40శాతం టీకా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ నిర్ణయం ఎంతో కీలకమైంది’ అంటూ టెడ్రోస్ ట్వీట్ చేశారు. ఆరోగ్య సంస్థ, గవి వ్యాక్సిన్ అలయన్స్ ఆధ్వర్యంలో కొవాక్స్ కార్యక్రమం నడుస్తోంది. పలు దేశాల నుంచి టీకాలను సేకరించి, అంతర్జాతీయంగా పంపిణీ చేస్తోంది. అయితే భారత్‌ ఎగుమతి నిలిపివేయడం ఈ కార్యక్రమంపై ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగం నేపథ్యంలో మాండవీయ ప్రకటన వెలువడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని