Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యం.. కఠిన చర్యలకు సిద్ధమవుతోన్నహోంశాఖ..!

పంజాబ్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

Published : 06 Jan 2022 18:42 IST

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడి

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. వాటికి అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందన్నారు. ప్రధాని అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలను వెల్లడించిన ఆయన.. ఇప్పటికే ప్రధాని భద్రతా వ్యవహారంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.

‘న్యాయవ్యవస్థ దేశంలోని ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తుందనే విశ్వాసం నాకుంది. అటువంటి తప్పిదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అవసరమో అవి తీసుకోవాలి. భద్రతా వైఫల్యంపై చర్యలు తీసుకునేందుకు హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే సన్నద్ధమైంది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత భారీ, కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్‌, ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీలు భేటీ అయ్యాయి. ఇదే సమయంలో భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ కమిటీతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోనూ ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి.. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పంజాబ్‌ ప్రభుత్వానిదే బాధ్యత..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే బాధ్యత అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రమైన వైఫల్యాలకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని క్షమించలేమని అన్నారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రధాని వంటి వ్యక్తులకే భద్రత కల్పించలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఈ తరహా నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని