నన్నే ప్రశ్నిస్తావా?యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు మరో తలనొప్పి ఎదురైంది. అగ్రనేతలతో ఇబ్బంది పడుతోన్న ఆ పార్టీకి ఎమ్మెల్యే రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తనను ప్రశ్నించిన ఓ యువకుడిపై పార్టీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 21 Oct 2021 01:21 IST

చండీగఢ్‌: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో తలనొప్పి ఎదురైంది. అగ్రనేతల వర్గపోరుతో ఇబ్బంది పడుతోన్న ఆ పార్టీకి ఎమ్మెల్యే రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తనను ప్రశ్నించిన ఓ యువకుడిపై పార్టీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

 ఆ వీడియోలో పఠాన్‌కోట్‌లోని భోవా(BHOA) గ్రామంలో ప్రజలను ఉద్దేశించి జోగిందర్ పాల్ ప్రసంగిస్తున్నారు. ఆ గ్రామంలో పర్యవేక్షించిన పనుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో గుంపులో ఉన్న ఓ వ్యక్తి గొణగడం ఆయన గమనించినప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా అతడు ఆగలేదు. అప్పుడు ఎమ్మెల్యే దగ్గరకు పిలిచి, మైకిచ్చి మాట్లాడమని చెప్పడం కనిపిస్తోంది. ‘నువ్వు మాకు ఏం చేశావ్‌?’ అంటూ ఆ యువకుడు ప్రశ్నించగా.. ఎమ్మెల్యే సహనం కోల్పోయి, చితకబాదారు. పక్కనే ఉన్న మరికొందరు కూడా జతకలిశారు. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకునే వరకు వారు కొడుతూనే ఉన్నారు. ఈ వీడియోలో ఎమ్మెల్యే తనను తాను నియంత్రించుకోలేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. దీనిపై పంజాబ్ హోం మంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావా స్పందించారు. ‘ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేం ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడ ఉన్నాం. మేం వారి ప్రతినిధులం’ అని ఆయన మాట్లాడారు.  

ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, మాజీ ముఖ్యమంత్రి అమరీంద్ సింగ్ మధ్య విభేదాలతో కాంగ్రెస్ సతమతమైంది. ఆ రాష్ట్రంలో పట్టున్న అమరీందర్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడం, కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సిద్ధూకు పొసగడం లేదన్న కథనాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని