Parliament: కొత్త మంత్రులను పరిచయం చేసిన మోదీ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ

Published : 19 Jul 2021 11:44 IST

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా నలుగురు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగడంతో కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అయితే ప్రధాని మాట్లాడటం మొదలుపెట్టగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు ధరలు, కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.

దీంతో స్పీకర్‌ కల్పించుకుని ప్రతిపక్ష సభ్యులను వారించారు. అయినప్పటికీ వారు నినాదాలు కొనసాగించడంతో ఆందోళనల నడుమే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎక్కువ మంది ఎస్సీలు మంత్రులు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే మహిళలు, ఓబీసీలు, రైతుల బిడ్దలు మంత్రులు కావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే వారిని సభకు పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారంటూ విపక్షాలను దుయ్యబట్టారు.

ఆ తర్వాత ఇటీవల మృతిచెందిన ఎంపీలు, పార్లమెంట్‌ మాజీ సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. కరోనా, ఇతర కారణాలతో పార్లమెంటు గత సమావేశాల నుంచి ఇప్పటివరకు ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు, 50 మంది మాజీ ఎంపీలు కన్నుమూశారు. దివంగత ఎంపీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అజ్మీరా చందూలాల్‌, ఎం.సత్యనారాయణరావు, సబ్బం హరి ఉన్నారు. సంతాప కార్యక్రమం అనంతరం స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ దివంగత ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళులర్పించారు. ప్రముఖ నటులు దిలీప్‌ కుమార్‌, పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ మృతిపై ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని