Lakhimpur Kheri violence: మోదీజీ.. మీరెందుకు మౌనంగా ఉన్నారు..?

లఖింపుర్ ఖేరి హింసాకాండలో రైతుల మృతిపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

Updated : 08 Oct 2021 13:38 IST

దిల్లీ: లఖింపుర్ ఖేరి హింసాకాండలో రైతుల మృతిపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని నుంచి కాస్త సానుభూతిని ఆశిస్తున్నట్లు శుక్రవారం ట్విటర్ వేదికగా తెలిపారు. ‘మోదీజీ, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ నుంచి కొద్దిపాటి సానుభూతిని ఆశిస్తున్నాం. అదేమంత కష్టమైన విషయం కాదు. మీరు ప్రతిపక్షంలో ఉండి ఉంటే ఎలా స్పందించేవారు? దయచేసి చెప్పండి’ అంటూ సిబల్ వ్యాఖ్యానించారు. లఖింపుర్ ఘటనపై ఇంతవరకు మోదీ స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. లఖింపుర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న రైతులపైకి కేంద్రమంత్రి తనయుడు ప్రయాణిస్తోన్న వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. దాంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

భారత్-నేపాల్ సరిహద్దు వద్ద కేంద్రమంత్రి తనయుడు..

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రాను భారత్‌-నేపాల్ సరిహద్దులోని గౌరీఫంట ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఘటనాస్థలం లఖింపుర్ ఖేరికి దగ్గర్లోనే ఉంది. కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు ఆశిష్‌కు యూపీ పోలీసులు గురువారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రోజు ఉదయం యూపీ పోలీసులు ఆశిష్‌ను ప్రశ్నించాల్సి ఉండగా.. ఆయన హాజరు కాలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఆశిష్ సోదరుడు కొట్టిపారేశారు. తన సోదరుడు లఖింపుర్‌లోనే ఉన్నాడని, పోలీసుల ముందు హాజరవుతాడని మీడియాకు వెల్లడించారు. ఘటన జరిగిన దగ్గరి నుంచి ఆశిష్‌ను అరెస్టు చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ, పోలీసుల వైఖరిని నిరసిస్తున్నాయి.  కాగా, ఈ కేసు విచారణకు డీఐజీ నేతృత్వంలో 9 మంది సభ్యుల పర్యవేక్షక కమిటీని యూపీ పోలీసులు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని