Anil Deshmukh: ముందు జైలు తిండి తినండి..: మాజీ మంత్రికి కోర్టులో చుక్కెదురు

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ (71)కు న్యాయస్థానం మరో 14రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Published : 15 Nov 2021 15:55 IST

అనిల్‌ దేశ్‌ముఖ్‌కు 14 రోజలపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ముంబయి: మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ (71)కు న్యాయస్థానం మరో 14రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా ఇంటి నుంచి ఆహారం, ఔషధాలను అనుమతించాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ తరపున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ముందు కొన్ని రోజులపాటు జైలు ఆహారం తినండి. జైలు ఆహారంపై ఏదైనా ఫిర్యాదు ఉంటే మా దృష్టికి తీసుకురండి. అప్పుడు మీ విజ్ఞప్తిని పరిశీలిస్తాం’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. వయసురీత్యా నేలపై పడుకోలేనని, అందుకు బెడ్‌కు అనుమతి ఇవ్వాలని అనిల్‌ తరపున న్యాయవాది కోరగా అందుకు మాత్రం న్యాయస్థానం అంగీకరించింది.

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) కింద విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నవంబర్‌ 1న అరెస్టు చేసింది. అనంతరం కేసు విచారణలో భాగంగా కస్టడీకి తీసుకున్న ఈడీ.. గడువు ముగిసిన నేపథ్యంలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచింది. మరోసారి విచారించేందుకు దర్యాప్తు సంస్థ గడువు కోరకపోవడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు తాజాగా 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు కుందన్‌ షిండే, సంజీవ్‌ పలాండేలను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

ఇదిలాఉంటే, ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు సంచలనం కావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇదే సమయంలో మనీలాండరింగ్‌పై విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నవంబర్‌ తొలివారంలో ఆయనను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని