
Indian Defence: ప్రపంచంలో ‘అతిపెద్ద సైనిక శక్తి’గా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
దిల్లీ: దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 41ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు మరిన్ని నాన్ ప్రొడక్షన్ యూనిట్లను విలీనం చేసి కార్పొరేట్ హంగులు తీర్చిదిద్దామని అన్నారు. ఈ ఏడు ప్రభుత్వరంగ రక్షణ సంస్థలను ప్రారంభించిన మోదీ.. రక్షణ రంగంలో ప్రస్తుతం ఉన్నంత పారదర్శకత, నమ్మకం ఇంతకు ముందెన్నడూ లేదన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
‘స్వాతంత్ర్య వచ్చిన అనంతరం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నప్పటికీ అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘పనులు అలాగే నిలిచిపోవడం’ అనే పద్ధతి స్థానంలో సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనివల్ల మన పరిశ్రమ వర్గాల విశ్వాసనీయత మరింత పెరిగింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే కార్యక్రమంలో భాగంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం. వీటితో పాటు అధునాతన రక్షణ పరిశ్రమను భారత్‌లో మరింత అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. దీన్ని అమలు చేసేందుకే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా గడిచిన ఏడేళ్లుగా ముందుకు వెళ్తున్నాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆత్మనిర్భర భారత్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కార్పొరేట్ తరహా ఈ నూతన రక్షణ సంస్థలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ రక్షణ రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.