Pappu: ‘పప్పూ’.. కూడా అన్‌పార్లమెంటరీ పదమే!

రాహుల్‌ గాంధీని పరోక్షంగా ప్రస్తావించే ‘పప్పూ’ పదంతో పాటు ‘మిస్టర్‌ బంటాధార్’ వంటి పదాలను అన్‌పార్లమెంటరీ జాబితాలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ చేర్చింది.

Published : 09 Aug 2021 01:12 IST

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ నూతన బుక్‌లెట్‌

భోపాల్‌: చట్టసభల్లో సభ్యులు మాట్లాడే భాష ఎంతో హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒక్కోసారి సభ్యులు అసభ్యకరమైన భాషను వాడతారని.. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచ్చరించకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శాసనసభ సభ్యులు ఉచ్చరించకూడని అసభ్య పదాల (Unparliamentary Words) జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. తాజాగా 38 పదాలు/ పదబంధాలు/ వాక్యాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించిన ప్రభుత్వం.. వాటిని సభ్యులకు అందించింది. తాజా జాబితాలో రాహుల్‌ గాంధీని పరోక్షంగా ప్రస్తావించే ‘పప్పూ’ పదంతో పాటు ‘మిస్టర్‌ బంటాధార్’ వంటి పదాలను చేర్చడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లో విధాన సభ ప్రారంభమైన నాటి నుంచి వందల పదాలను అన్‌పార్లమెంటరీ భాషలో పొందుపరచారు. సమావేశాల్లో ప్రసంగించే సభ్యులు అలాంటి పదాలను వాడకూడదని సూచిస్తూనే ఉంటారు. తాజాగా ఆ జాబితాలో ‘పప్పూ’, ‘మిస్టర్‌ బంటాధార్’ వంటి పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు డోంగీ (మోసగాడు), నీకమ్మా (పనికిరాని), చోర్‌ (దొంగ), భ్రస్ట్‌ (అవినీతిపరుడు), గూండా వంటి హిందీ పదాలను అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో పొందుపరచారు. ఈ జాబితాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ కమల్‌ నాథ్‌,  మంత్రి నరోత్తమ్‌ మిశ్రాతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ గిరీష్‌ గౌతమ్‌లు విడుదల చేశారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చట్టసభలో భాషపై అవగాహనకు సంబంధించి సభ్యుల కోసం ఈ బుక్‌లెట్‌ను అందించారు. సభలో మాట్లాడేటప్పుడు సభ్యులు ఉపయోగించకూడని పదాలను మరచిపోవడం చాలాసార్లు జరుగుతుందని.. అలాంటి సందర్భంలో సభ్యులకు ఈ బుక్‌లెట్‌ ఎంతగానో దోహదపడుతుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయాలుగా అభివర్ణించే (పార్లమెంట్‌, విధాన సభ) వేదికలపై చట్టసభ సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎగతాళి చేయడం కోసం ఆయన వ్యతిరేకులు లేదా భాజపా మద్దతుదారులు పప్పూ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇక మిస్టర్‌ బంటాధార్ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్‌ను విమర్శించడం కోసం వాడుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని