ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ‘టీకా’ వివాదం

భాజపా ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె కరోనా టీకా తీసుకున్నారు. అయితే ఎంపీ తన ఇంటివద్దే వ్యాక్సిన్‌ వేయించుకున్న

Published : 17 Jul 2021 01:06 IST

భోపాల్‌: భాజపా ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె కరోనా టీకా తీసుకున్నారు. అయితే ఎంపీ తన ఇంటివద్దే వ్యాక్సిన్‌ వేయించుకున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అయ్యింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది.

ఇటీవల ఆరోగ్య సిబ్బంది ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఇంటికి వెళ్లి ఆమెకు కరోనా టీకా తొలిడోసు వేశారు. ‘వృద్ధులు, వికలాంగుల’ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిబంధనల మేరకు ఆమెకు తన ఇంటివద్దే వ్యాక్సిన్‌ వేసినట్లు ఆరోగ్య సిబ్బంది మీడియాకు తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితమే బాస్కెట్‌బాల్‌ ఆడుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఆరోగ్యంగా కన్పించిన ఎంపీ.. ఇప్పుడు ఇలా ఇంటివద్దే టీకా వేయించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

‘‘ఇటీవలే బాస్కెట్‌ బాల్‌ ఆడి, డ్యాన్స్‌ చేసి అలరించిన మన భోపాల్‌ ఎంపీ.. ఇప్పుడు ఆరోగ్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకుని టీకా వేయించుకున్నారు. ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ వరకు భాజపా నేతలందరూ ఆసుపత్రికి వెళ్లే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మరి ఆమెకు ఎందుకు మినహాయింపు కల్పించారు?’’ అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో బెయిల్‌పై విడుదలైన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌.. ఆరోగ్య కారణాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోర్టును కోరారు. అయితే ఇటీవల ఆమె బాస్కెట్‌బాల్‌ ఆడిన, డ్యాన్స్‌ చేసిన వీడియోలు వైరల్‌ అవ్వడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని