Vaccination: ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల.. ఇక రాత్రి వేళల్లోనూ టీకా సెంటర్లు!

ముంబయిలో రాత్రిపూట కూడా టీకాలు వేసేందుకు ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాట్లు చేసింది. రాత్రిపూట టీకా సెషన్లు ప్రారంభించి అర్హులకు అందించే ప్రక్రియను మొదలుపెట్టింది.....

Published : 15 Dec 2021 16:47 IST

ముంబయి: కరోనా రెండో దశలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్న ముంబయి నగరాన్ని ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను మరింత ఉద్ధృతం చేసి, త్వరగా అందరికి రెండు డోసులు పూర్తిచేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే నగరంలో రాత్రిపూట కూడా టీకాలు వేసేందుకు ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాట్లు చేసింది. రాత్రిపూట టీకా సెషన్లు ప్రారంభించి అర్హులకు అందించే ప్రక్రియను మొదలుపెట్టింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని అన్ని వార్డుల్లో మొబైల్ టీం లేదా వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేయనున్నట్లు బీఎంసీ వెల్లడించింది.

రైల్వేస్టేషన్లు, మురికివాడలు, నిర్మాణ ప్రాంతాలు సహా మరికొన్ని ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు మొబైల్ బృందాలు ఉంటాయి. కార్మికులు, రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారుల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలు, మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో టీకాలు తీసుకోని వారు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రోగనిరోధక సెషన్ నిర్వహించనున్నారు. ‘కొన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం సోమవారమే ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతి వార్డులో కనీసం ఒక టీకా కేంద్రం అందుబాటులో ఉంటుంది’ అని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ మంగళ గోమరే వెల్లడించారు. ముంబయిలో ఇప్పటికే 80 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇంకా 20 శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 28 కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు వెలుగుచూడగా.. అందులో 7 ముంబయి నుంచే ఉన్నాయి. దీంతో వాణిజ్య రాజధానిలో కేసుల సంఖ్య 12కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని