Parliament: రాజ్యసభలో ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్‌

రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పటడింది. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టినందుకుగానూ ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులను

Published : 04 Aug 2021 14:11 IST

దిల్లీ: రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టినందుకుగానూ ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులను ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్‌ చేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూడా రాజ్యసభలో టీఎంసీతో పాటు ఇతర విపక్ష ఎంపీలు పెగాసస్‌ అంశంపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విపక్ష సభ్యులు ఆందోళన విరమించాలని, తమ తమ సీట్లలో కూర్చోవాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తొలుత సూచించారు. లేదంటే ప్లకార్డులు పట్టుకున్నందుకు 255 నిబంధనను అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినప్పటికీ వారు పట్టువిడవలేదు. దీంతో రాజ్యసభ ఛైర్‌ను అగౌరవపర్చిన వారిపై 255 నిబంధనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత రాజ్యసభ సెక్రటేరియట్‌ నిబంధనకు గురైన సభ్యుల పేర్ల జాబితాను విడుదల చేసింది. టీఎంసీకి చెందిన డోలా సెన్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌, అబిర్‌ రంజన్‌ బిశ్వాస్‌, శాంత ఛెత్రి, అర్పితా ఘోష్‌, మౌసమ్‌ నూర్‌ను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని