
Nawab malik: నన్ను క్షమించండి.. మరోసారి అలా చేయను: మాలిక్
ముంబయి: న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి సమీర్ వాంఖడేతో పాటు ఆయన కుటుంబంపై మరోసారి బహిరంగ వ్యాఖ్యలు చేయడం పట్ల మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ క్షమాపణ కోరారు. ఇక ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేయబోనని బాంబే హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇది వరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం తన ఉద్దేశం కాదన్న ఆయన.. క్షమాపణ కోరుతూ బాంబే హైకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.
‘నవంబర్ 25, 29 తేదీల్లో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను’ అని బాంబే హైకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రమే అలా స్పందించానని.. సామాజిక మాధ్యమాల్లో వాంఖడేపై ఎలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయలేదని వివరించారు. ఇది విన్న న్యాయస్థానం నవాబ్ మాలిక్ క్షమాపణను అంగీకరించినట్లు తెలిపింది. ఇటువంటి చర్చకు తక్షణమే ముగింపు పలుకుతూ రాజీకి వచ్చేలా చూడాలని ఇరుపక్షాల న్యాయవాదులకు బాంబే హైకోర్టు సూచించింది.
తనతోపాటు తన కుటుంబ పరువుకు భంగం కలిగేలా నవాబ్ మాలిక్ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే తండ్రి, ధ్యాన్‌దేవ్ వాంఖడే బాంబే హైకోర్టులో దావా వేశారు. దీనిపై ఇదివరకే విచారణ మొదలుపెట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సమీర్ వాంఖడేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా మాలిక్ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం.. దురుద్దేశంతోనే ఆయన బహిరంగ వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది. తదుపరి విచారణ వరకూ వాంఖడేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నవాబ్ మాలిక్.. మరోసారి వాంఖడేపై విమర్శలు కొనసాగించారు. దీంతో తాను ఇచ్చిన మాట తప్పి వాంఖడేపై వ్యాఖ్యలు చేశానని.. ఇందుకు న్యాయస్థానం క్షమించాలని తాజాగా బాంబే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.