
Nawab Malik: ఒక్కసారి వాంఖడే ఫోన్ పరిశీలిస్తే.. ఆరోపణలపై స్పష్టత వస్తుంది..!
మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి మాలిక్
ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు కంటే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న ఆరోపణలే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై గత కొద్ది రోజులుగా ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలు ఫొటోలు, లేఖలు విడుదల చేస్తున్నారు. బుధవారం మరోసారి తన ఆరోపణల్ని కొనసాగించారు.
‘క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసుల దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నానని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలను బయటకు తీసుకురావడమే నా పని. ఆ నౌకలో డ్రగ్ మాఫియా ఉంది. దాని గురించి అధికారులందరికీ తెలుసు. అక్కడున్న వ్యక్తుల గురించి మీకు త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. అలాగే ఈ కేసులో ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎన్సీబీ చెప్తోంది. అయితే, సమీర్ వాంఖడే, ప్రభాకర్ సాయీల్, కిరణ్ గోసావి, వాంఖడే డ్రైవర్‌కు సంబంధించిన కాల్ వివరాలను పరిశీలించాలి. ఒకసారి దర్యాప్తు చేస్తే మొత్తం స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో దీపికా, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌ను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. కానీ, ఒక్క అరెస్టు చేయలేదు. ఈ విషయాన్ని మనం ఒకసారి లెక్కలోకి తీసుకోవాలి. నిజం తెలుసుకునేందుకు మాల్దీవుల పర్యటనను కూడా గమనించాలి’ అంటూ మరోసారి సమీర్ వాంఖడేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమీర్‌పై విచారణ.. దిల్లీ నుంచి ముంబయికి అధికారులు
ఆర్యన్ ఖాన్ కేసులో కీలకంగా వ్యవహరించిన సమీర్ వాంఖడేపై వస్తోన్న ఆరోపణలపై ఎన్సీబీ దృష్టి సారించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా అధికారుల బృందం నేడు దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నారు. ఆర్యన్‌ను విడుదల చేసేందుకు అతడి తండ్రి షారుక్ ఖాన్ నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.