Updated : 02 Nov 2021 12:50 IST

Nawab Malik: వాంఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70 వేలు: మాలిక్‌

నన్ను వేలెత్తి చూపే ధైర్యం ఎవరికీ లేదు: మంత్రి నవాబ్‌ మాలిక్‌

దిల్లీ: బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫడణవీస్‌ చేసిన ఆరోపణలకు మాలిక్‌ కౌంటర్‌ ఇచ్చారు

‘నవాబ్ మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని కొందరు అన్నారు. గత 62 సంవత్సరాలుగా నేను ఈ నగరంలో ఉంటున్నాను. నా మీద వేలెత్తి చూపి, నాకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఫడణవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్దే ఉంది. దీనిపై ఆయన అప్పుడే ఎందుకు విచారణ జరపలేదు’ అని మాలిక్ ఎదురుదాడికి దిగారు. 

సమీర్‌పై మరోసారి ఘాటు విమర్శలు.. డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడేపై మాలిక్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ జోనల్ డైరెక్టర్ కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని ఆరోపించారు.

‘సమీర్ వాంఖడే.. రూ.లక్ష విలువైన ట్రౌజర్, రూ.70 వేల విలువైన చొక్కా, 25 నుంచి 30 లక్షల విలువైన చేతి గడియారాలు ధరించారు. ఒక నిజాయతీ గల అధికారి అంతటి విలువైన వస్తువుల్ని ఎలా కొనుగోలు చేయగలరు? అక్రమంగా కొందరిని కేసుల్లో ఇరికించి, కోట్లకు పడగలెత్తారు. ఈ తరహా పనులు చేయడానికి ఆయనకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులున్నారు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని సమీర్ తిప్పికొట్టారు. ‘నా ఖరీదైన దుస్తులు గురించి చేసిన వ్యాఖ్యలన్నీ పుకార్లు మాత్రమే. ఆయనకు వాటి గురించి సరిగా తెలిసుండదు. వాస్తవాలు గుర్తించాలి’ అని అన్నారు. అలాగే డ్రగ్‌ మాఫియా తమ అధికారుల్ని, తన కుటుంబాన్ని ట్రాప్‌ చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడేపై మాలిక్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఫడణవీస్‌ను ఇందులోకి లాగారు. దానిపై మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఆయన మాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మేం మాత్రం మర్యాద దాటలేదు. ఆయన మాటలకు దీపావళి తర్వాత సమాధానం చెప్తాం’ అన్నారు. అలాగే అండర్ వరల్డ్‌తో ఆయనకున్న సంబంధాల్ని బహిర్గతం చేస్తామన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని