
Nawab Malik: ‘ఆ హోటల్ సీక్రెట్స్’తో.. త్వరలోనే మీ ముందుకు!
దీపావళి తర్వాత బయటపెడతానన్న నవాబ్ మాలిక్
ముంబయి: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ కేసుకు నేతృత్వం వహిస్తోన్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. వాంఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70వేల, ప్యాంటు విలువ లక్ష రూపాయలంటూ ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. తర్వలోనే మరిన్ని సీక్రెట్స్ బయటపెడుతానని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వచ్చే ఆదివారం మరిన్ని ‘సీక్రెట్స్’తో మీ ముందుకు వస్తానంటూ ట్విట్ చేశారు.
‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ది లలిత్ (The Lalit) హోటల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిన్నింటితో ఆదివారం మీ ముందుకు వస్తా’ అంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అయితే, వాంఖడే, ఫడణవీస్ కుటుంబాలపై వరుస ఆరోపణలు గుప్పిస్తోన్న నవాబ్ మాలిక్.. తాజాగా వీరికి సంబంధించిన మరిన్ని రహస్యాలనే బయటపెడతానని పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే అంతకుముందుకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కుటుంబంపై నవాబ్ మాలిక్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన ఫడణవీస్.. దీపావళి తర్వాత నవాబ్ మాలిక్ ఆరోపణలకు సమాధానం చెబుతామని ఈ మధ్యే ప్రకటించారు. ముఖ్యంగా నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వెల్లడించారు. ఫడణవీస్ వ్యాఖ్యలకు బదులిచ్చిన నవాబ్ మాలిక్.. నాపై వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. ఒకవేళ అండర్ వరల్డ్‌తో అటువంటి సంబంధాలే ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫడణవీస్ ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఇలా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం.. దీపావళి తర్వాత మరిన్ని రహస్యాలను బయట పెడుతామని ప్రకటించడం ముంబయి డ్రగ్స్ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది.