Nawab Malik: నీది దీపావళి బాంబు అయితే.. నాది హైడ్రోజన్ బాంబు!

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ దీపావళి బాంబు పేల్చారు.

Published : 09 Nov 2021 18:59 IST

ముంబయి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ దీపావళి బాంబు పేల్చారు. దీనిపై స్పందించిన మాలిక్.. తాను రేపు ఆ భాజపా నేతపై హైడ్రోజన్ బాంబు వదులుతానని వెల్లడించారు. ‘దేవేంద్ర ఫడణవీస్‌కు అండర్‌ వరల్డ్‌తో ఉన్న సంబంధాలు నేను బయటపెడతాను. ఆ వివరాలన్నీ వెల్లడించి, రేపు నేను హైడ్రోజన్ బాంబు వదులుతాను. ముంబయి పేలుళ్ల దోషులతో సంబంధాలున్నాయని చెప్పి, నా ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేశారు. నా పరిసరాల్లో డ్రగ్స్ దొరికాయని చెప్పి అదే చేశారు. వారికి నేను లీగల్ నోటీసులు పంపిస్తాను’ అంటూ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మాలిక్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు..

ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. అది చివరకు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై కూడా మాలిక్ ఆరోపణలు చేశారు. దాంతో వాంఖడే కుటుంబం ఆయనపై పరువునష్టం దావా వేసింది. మంత్రిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే ఓషివారా డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. తాము షెడ్యూల్ కులాల కేటగిరీలోని మహర్ కులానికి చెందిన వారమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని