Cruise ship incident: ఆర్యన్‌ను ఇరికించేందుకే అక్కడకు పిలిచారు..!

డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వైఖరిని తప్పుపడుతూ కొన్ని దృశ్యాలను శనివారం విడుదల చేశారు. 

Published : 10 Oct 2021 01:32 IST

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు

ఆ ముగ్గుర్ని ఎన్‌సీబీ ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నించిన మంత్రి

ముంబయి: డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వైఖరిని తప్పుపడుతూ కొన్ని దృశ్యాలను శనివారం విడుదల చేశారు. గతవారం ముంబయి తీర ప్రాంతంలో క్రూజ్ నౌకలో పట్టుబడిన ఓ భాజపా నేత బంధువును ఎన్‌సీబీ వదిలేసిందని సాక్ష్యాలతో సహా ఆరోపణలు చేశారు. భాజపా నేత మోహిత్ కాంబోజ్‌ బంధువు రిషబ్ సచ్‌దేవ్ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వెంటనే విడుదలయ్యారని నవాబ్ మాలిక్ మీడియాకు వెల్లడించారు. రిషబ్‌తో కలిపి ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ విడుదల చేసిందన్నారు. మోహిత్ గతంలో ముంబయి భాజపా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. 

‘డ్రగ్స్ కేసులో నిర్బంధించిన వ్యక్తుల గురించి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అస్పష్టమైన ప్రకటన చేశారు. 8-10 మంది వరకు అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే రాష్ట్ర పోలీసులు ఈ వ్యవహారంపై ఒక కన్నేసి ఉంచారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ సంఖ్య పదకొండు. తెల్లారి ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గింది. ముగ్గుర్ని వదిలేశారు’ అంటూ నవాబ్‌ మాలిక్‌ విమర్శించారు. రిషబ్ సహ మరో ఇద్దరు వ్యక్తులు ఎన్‌సీబీ కార్యాలయంలోకి వెళ్లిన దృశ్యాలను మంత్రి మీడియాకు చూపించారు. అలాగే మోహిత్‌తో రిషబ్ దిగిన ఫొటోలను కూడా బయటపెట్టారు. నవాబ్ మాలిక్ కార్యాలయం దానికి సంబంధించిన చిత్రాన్ని ట్వీట్ చేసింది. 

‘రిషబ్, ప్రతీక్‌ గబా, ఆమిర్‌ ఫర్నీచర్‌వాలా విడుదల కోసం రాష్ట్రం, దిల్లీకి చెందిన భాజపా నేతలు ఫోన్లు చేశారని మాకు అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. వాంఖడే వారిని ఎందుకు వదిలేశారో చెప్పాలి. వారిని వదిలేసేముందు ఎలాటి విచారణ జరిగింది?’ అని మంత్రి ప్రశ్నించారు. కొంతమందిని ఇరికించే ప్లాన్‌తోనే క్రూజ్ నౌకపై ఎన్‌సీబీ దాడి జరిగిందని విమర్శించారు. ‘ఇది పూర్తిగా నకిలీ దాడి. ఆర్యన్ ఖాన్ వద్ద ఏమీ గుర్తించలేదు. ఆర్యన్‌ను ఇరికించడానికి ప్రతీక్‌, ఆమిర్‌ అతడిని అక్కడకు రప్పించారు. వారిద్దరి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాడు’ అని వెల్లడించారు. సొంత అజెండా కోసం భాజపా ఎన్‌సీబీని ఉపయోగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మహారాష్ట్ర, బాలీవుడ్‌ పరువు తీయడం కిందికే వస్తుంది’ అంటూ ఆయన కార్యాలయం మరో ట్వీట్ చేసింది. 

ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న క్రూజ్‌ నౌకలో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న అభియోగంపై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా పలువురిని గతవారం ఎన్‌సీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని