MeToo Allegations: కొత్త ముఖ్యమంత్రికి.. మీటూ ఆరోపణల సెగ!

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌పై మీటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది.

Published : 20 Sep 2021 18:28 IST

రాజీనామా చేయాలన్న జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

దిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కొద్ది గంటలు గడవకముందే చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌పై మీటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమితులవ్వడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది.

‘పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ నియామకం కావడం సిగ్గుచేటు, తీవ్ర అభ్యంతరకరం. ఓ ఐఏఎస్‌ అధికారిణికి అసభ్యకర మెసేజ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి వేధింపులు మరో మహిళకు జరగకూడదని కోరుకుంటున్నాం. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ డిమాండ్‌ చేశారు.  ఓ మహిళా ఐఏఎస్‌ అధికారికే న్యాయం జరగకుంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఉన్నతాధికారులకే వేధింపులు ఎదురైతే.. సాధారణ మహిళలకు రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్‌ ఎలా భరోసా ఇవ్వగలదని అన్నారు. పార్టీ అధినేత (ఓ మహిళగా)కు చరణ్‌జిత్‌పై మీటూ ఆరోపణలు కనిపించలేదా అని జాతీయ మహిళా కమిషన్‌ చీఫ్‌ రేఖా శర్మ ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, 2018లో మహిళా ఐఏఎస్‌ అధికారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టారంటూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆ అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా వెల్లడించింది. అయితే, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలంటూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శికి లేఖ రాసినట్లు పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మనీషా గులాటి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు