Published : 17 Dec 2021 21:48 IST

CDS: కొత్త సీడీఎస్‌ నియామకంపై.. త్వరలోనే రాజ్‌నాథ్‌ వద్దకు అర్హుల జాబితా!

దిల్లీ: నూతన త్రిదళాధిపతి(సీడీఎస్‌)ని ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను ప్రభుత్వం ఖరారు చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ సిఫారసు చేసిన పేర్లను రాజ్​నాథ్ సింగ్​కు పంపుతామన్నారు. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం సీడీఎస్​ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే కేబినెట్​ నియామకాల కమిటీ వద్దకు పేర్లు వెళతాయని తెలిపారు.

సైన్యాధిపతి, త్రివిధ దళాల అధిపతుల కమిటీ ఛైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జరనల్ ఎంఎం నరవణెకే కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019 డిసెంబర్​ 31న నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతమున్న వాయుసేన చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్​ 30నే బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​.హరికుమార్​ నవంబర్​ 30న ఆ బాధ్యతలను తీసుకున్నారు. వీరిద్దరు ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించడం.. మరోవైపు అనుభవంలో అందరికన్నా సీనియర్ అయిన నరవణెకే ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిదళాధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్​ ఎంపిక విషయంలోనూ కేంద్రం పాటించనుంది.

డిసెంబర్‌ 8న తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ ప్రాణాలు కోల్పోయారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని