IHU Variant: ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ వ్యాప్తి?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వేళ.. ఫ్రాన్స్‌లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్‌ వెలుగు చూసింది.

Published : 05 Jan 2022 02:03 IST

ఒమిక్రాన్‌ కంటే అధిక మ్యుటేషన్లు గుర్తింపు

పారిస్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణతో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. ఆయా దేశాల్లో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. డెల్టాతో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఈ ఆందోళనకర వేరియంట్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు చాలా దేశాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వేళ.. ఫ్రాన్స్‌లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్‌ వెలుగు చూసింది. అంతేకాకుండా ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు తేలడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న యూరప్‌లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్‌ బయటపడింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని అంటువ్యాధుల పరిశోధన కేంద్రం నిపుణులు వెల్లడించారు. ఈ వేరియంట్‌ను IHU (B.1.640.2) రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇందులో దాదాపు 46 మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఈ వేరియంట్‌కు సంబంధించి ఫ్రాన్స్‌లోని మార్సిల్లెస్‌ నగరంలో ఇప్పటికే 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆఫ్రికాలోని కామెరూన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్‌ బయటపడినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్‌లపై ఈ కొత్త వేరియంట్‌ ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పడం తొందరపాటే అవుతుందని ఫ్రాన్స్‌ నిపుణులు పేర్కొన్నారు.

ప్రమాదకరం కాకపోవచ్చు..!

ఫ్రాన్స్‌లో వెలుగుచూసిన ఈ కొత్తరకం వేరియంట్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌, హెల్త్‌ ఎకనామిస్ట్‌ ఎరిక్‌ డింగ్‌ స్పందించారు. కొత్త వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లు జరిగినట్లు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాన్ని ఎరిక్‌ డింగ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. అయితే, భవిష్యత్తులో ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న ఆయన.. ఇలాంటివన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వేరియంట్‌ విస్తృతి, గతంలో వచ్చిన ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్‌ మాదిరిగా ఆందోళనకర వేరియంట్‌గా పరిగణిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్‌ ఏ విభాగం కిందకు వస్తుందనే విషయాన్ని పరిశీలించాలని.. తద్వారా వైరస్‌ ప్రాబల్యంపై ఓ అంచనాకు రావచ్చని ఎరిక్‌ డింగ్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్‌ ప్రపంచదేశాల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 10లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 130 దేశాలకుపైగా విస్తరించింది. అయితే, ఫ్రాన్స్‌లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ కేసులు ఇతర దేశాల్లో నమోదైన దాఖలాలు లేవు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్‌తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ ఫ్రాన్స్‌లో బయటపడిన వేరియంట్‌ మరోసారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని