Omicron Effect: మెట్రోనగరాల్లో కొవిడ్‌ మహమ్మారి ఉగ్రరూపం..!

గురువారం నాడు ఒక్క ముంబయి నగరంలోనే 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అటు దేశ రాజధానిలోనూ 15వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Published : 06 Jan 2022 22:28 IST

ముంబయి, దిల్లీ నగరాల్లో రికార్డు స్థాయి కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముంబయి, దిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కొవిడ్‌ ఉద్ధృతి అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం నాడు ఒక్క ముంబయి నగరంలోనే 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అటు దేశ రాజధానిలోనూ 15వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలోనూ దాదాపు 10వేల కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మొదలైన కొవిడ్‌ విజృంభణ.. మరికొన్ని రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముంబయిలో..

మునుపటి వేవ్‌ల మాదిరిగానే ప్రస్తుతం కూడా కొవిడ్ ఉద్ధృతి మహారాష్ట్రలోనే అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముంబయి మహా నగరంలో ఊహించని రీతిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం అక్కడ రెట్టింపు స్థాయిలో కేసులు రికార్డు కావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే ముంబయిలో 20,181 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. అంతకు ముందురోజుతో పోలిస్తే 30శాతం పెరుగుదల కనిపించింది. ఒకేరోజు ఈ స్థాయిలో నమోదు కావడం కూడా కొవిడ్‌ వెలుగు చూసిన తర్వాత ఇదే తొలిసారి. అయితే, పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 85శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని.. వీరిలో 1170 మంది ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

రాజధాని దిల్లీలో..

దేశ రాజధాని దిల్లీలోనూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 15,097 కేసులు రికార్డు కాగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 15శాతం దాటినట్లు తెలిపింది. ముందురోజుతో పోలిస్తే పాజిటివ్‌ కేసుల్లో 30శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. అయితే, ఆస్పత్రి చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నాయని.. ప్రస్తుతం వెయ్యి మంది కొవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కోల్‌కతాలో పెరుగుతున్న కేసులు..

అటు పశ్చిమ బెంగాల్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 14వేల పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోల్‌కతాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే అక్కడ 9వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఈరోజు కూడా భారీగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. దీంతో మరిన్ని కొవిడ్‌ ఆంక్షలు తప్పవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంకేతాలిచ్చారు.

వీటితో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌వే ఉంటున్నట్లు ఆయా రాష్ట్రాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2135 ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాగా.. ఒక మరణం సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 4లక్షల 82వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని