C.1.2 Variant: విస్తృత వ్యాప్తిగల మరో వేరియంట్‌ గుర్తింపు..!

వైరస్‌ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం బయటపడింది. C.1.2గా పిలుస్తోన్న ఈ వేరియంట్‌ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది.

Published : 30 Aug 2021 20:25 IST

యాంటీబాడీల నుంచీ తప్పించుకునే సామర్థ్యం ఉందన్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకు తన రూపాలు మార్చుకుంటూనే ఉంది. ఇప్పటికే డెల్టా వంటి కొత్త వేరియంట్లతో ఆయా దేశాల్లో విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్‌ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం బయటపడింది. C.1.2గా పిలుస్తోన్న ఈ వేరియంట్‌ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ప్రస్తుతానికి ఆందోళనకర వైరస్‌గా వర్గీకరించనప్పటికీ.. వ్యాక్సిన్‌ల నుంచి కలిగే రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘C.1.2’ను ఈ ఏడాది మే నెలలో తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌ (NICD), క్వాజులు-నాటల్‌ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ సీక్వెన్సింగ్‌ ప్లాట్‌ఫాం (KRISP)లు సంయుక్తంగా ప్రకటించాయి. ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ ఈ వేరియంట్‌ విస్తరించినట్లు తెలిపాయి. అయితే, దక్షిణాఫ్రికాలో తొలివేవ్‌ విజృంభణ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిన C.1 వేరియంట్‌.. మరిన్ని మ్యుటేషన్‌లు చెంది C.1.2గా రూపాంతరం చెందినట్లు నిపుణులు పేర్కొన్నారు.

విస్తృత వేగంతో మ్యుటేషన్‌..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన ఈ రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న C.1.2 సీక్వెన్సింగ్‌ సమాచారం బట్టి చూస్తే.. దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ వ్యాప్తి, ప్రాబల్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. అయితే, బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే వీటి మ్యుటేషన్‌లో పెరుగుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజా అధ్యయనం ప్రకారం, ఈ వైరస్‌ మ్యుటేషన్‌ రేటు ఏడాదికి 41.8 (మ్యుటేషన్‌లు)గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇతర రకాల మ్యుటేషన్‌ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో మార్పులు చెందుతున్నట్లు తెలుస్తోంది.

యాంటీబాడీల నుంచి తప్పించుకునే సామర్థ్యం..

ఇప్పటికే వెలుగు చూసిన N440K, Y449H వంటి మ్యుటేషన్లు వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు తేలింది. ఇదే తరహాలో యాంటీబాడీలను తప్పించుకునే గుణం C.1.2 సీక్వెన్స్‌ల్లోనూ గుర్తించామని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి దీనిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గానే పరిశోధకులు పరిగణిస్తున్నారు. కానీ, యాంటీబాడీలనుంచి తప్పించుకోవడంతో పాటు రోగనిరోధక ప్రతిస్పందనలనూ ఇవి ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు