
Omicron Fear: దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. రోజురోజుకు రెట్టింపు!
24 దేశాలకు వ్యాప్తించిన ఒమిక్రాన్
జోహెన్నెస్‌బర్గ్: ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన సమయంలోనే.. దక్షిణాఫ్రికాలో కొవిడ్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కలవరపెడుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 9వేలు కేసులు బయటపడినట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం పేర్కొంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. అంతేకాకుండా కొవిడ్ పాజిటివిటీ రేటు 17శాతానికి పెరగడం పట్ల దక్షిణాఫ్రికా ఎన్‌ఐసీడీ ఆందోళన వ్యక్తం చేసింది.
17శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు..
‘దక్షిణాఫ్రికాలో నవంబర్ మొదటివారంలో కేవలం 200 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. రెండోవారం నుంచి కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. తాజాగా మంగళవారం 4373 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారానికి పాజిటివ్ కేసుల సంఖ్య 8561కి పెరిగింది. అంతేకాకుండా నవంబర్ తొలివారంలో 1శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది.. భవిష్యత్తులో ఇది నిత్యం మూడింతలు పెరిగే అవకాశం లేకపోలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్కీ గుమేడె మోయిలెసీ అంచనా వేశారు. అయితే, పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కొత్త వేరియంట్ కేసులు ఏ మేరకు ఉన్నయో జీనోమ్ సీక్వెన్సింగ్ ముమ్మరం చేయడం వల్లనే తెలుసుకోగలమని వెల్లడించారు. ఈ మధ్య నమోదైన కేసుల్లో (249 కేసులు) దాదాపు 74శాతం కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టామని దక్షిణాఫ్రికా ఎన్‌ఐసీడీ అధికారులు చెప్పారు.
24 దేశాల్లో ఒమిక్రాన్.. 56 దేశాలు ఆంక్షలు..
విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతోన్న కొత్త వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ కేసులు యూరప్ దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. ఇతర దేశాల్లో ఈ వేరియంట్‌కు సంబంధించి 250కి పైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపా ఖండంలో దాదాపు 50కేసులు వెలుగు చూశాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ భయంతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలు.. ఆఫ్రికా నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కేవలం ఆఫ్రికా నుంచే కాకుండా ఇప్పటికే కొత్త వేరియంట్ వెలుగు చూసిన దేశాలను అధిక ముప్పుగా ప్రకటిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాలు ఆంక్షలు విధించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
ఇవీ చదవండి
Advertisement