Omicron: డెల్టాతో పోలిస్తే 70 రెట్ల వేగం.. అయినప్పటికీ..!

డెల్టా కంటే 70రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రతిరూపం చెందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 15 Dec 2021 21:45 IST

వ్యాధి తీవ్రత మాత్రం తక్కువేనన్న తాజా అధ్యయనం

హాంకాంగ్‌: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృత వేగంతో సంక్రమిస్తున్నట్లు ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే అసాధారణ రీతిలో సంక్రమిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డెల్టా కంటే 70 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రతిరూపం చెందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ ఈ వేరియంట్‌ వల్ల వ్యాధి తీవ్రత (ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత) మాత్రం చాలా తక్కువగానే ఉందని, అందుకే బాధితుల్లో తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది.

అందుకే విస్తృత వేగం..

కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ సంక్రమణ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా మానవ శ్వాసనాళాల్లో వీటి ప్రతిరూపాలు వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డెల్టాతోపాటు ఒరిజినల్‌ కరోనా వైరస్‌తో పోలిస్తే 70 రెట్ల వేగంతో ప్రతిరూపాల సృష్టి జరుగుతోందని గుర్తించారు. అందుకే ఇదివరకు వేరియంట్లతో పోలిస్తే మానవుల్లో అత్యంత వేగంగా సంక్రమణ చెందుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ఊపిరితిత్తుల్లో మాత్రం ఈ వేరియంట్‌ తక్కువ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని హాంకాంగ్‌ పరిశోధకులు గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ప్రతిరూపం చెందడం దాదాపు 10 రెట్లు తక్కువగా ఉందని, అందుకే ఊపిరితిత్తుల కణాలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేయడంలో తక్కువ సామర్థ్యం కలిగివున్నట్లు అంచనా వేశారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్న వారిసంఖ్య తక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా ఆక్సిజన్‌, ఐసీయూలో చికిత్స అవసరం, మరణం సంభవించే ప్రమాదం ఇప్పటివరకు తక్కువగానే కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ ఈ వేరియంట్‌ తక్కువ తీవ్రత కలిగివుందనే నిర్ధారణకు ఇప్పుడే రావద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ఒకవేళ అలా ఊహించుకుంటే రానున్న రోజుల్లో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ 77దేశాలకు విస్తరించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని