Omicron: కొత్త వేరియంట్ వేళ.. చిన్నారుల్లో పెరిగిన ఆసుపత్రి చేరికలు..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రదేశం అమెరికాలో ఈ వేరియంట్ ఉద్ధృతి చూపుతోంది. ఈ సమయంలో న్యూయార్క్‌ నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Updated : 27 Dec 2021 13:54 IST

న్యూయార్క్ నగరంలో కనిపిస్తోన్న ధోరణి

న్యూయార్క్‌: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రదేశం అమెరికాలో ఈ వేరియంట్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ సమయంలో న్యూయార్క్‌ నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పిల్లల ఆసుపత్రుల్లో కొవిడ్‌తో సంబంధం ఉన్న కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని న్యూయార్క్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌ హెచ్చరించింది. ‘డిసెంబర్‌ 5న ప్రారంభమైన వారం నుంచి ప్రస్తుత వారం వరకు 18 ఏళ్ల లోపు వారిలో కొవిడ్ సంబంధిత ఆసుపత్రి చేరికలు నాలుగు రెట్లు పెరిగాయి. వారిలో దాదాపు సగం మంది ఐదు సంవత్సరాలకంటే తక్కువ వయస్సువారే’ అని వెల్లడించింది. ప్రస్తుతం ఐదేళ్లలోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని గుర్తుచేసింది.

ఇప్పటికే అమెరికాలో డెల్టాను అధిగమించి ఒమిక్రాన్ విస్తరిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం సీడీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో డెల్టాకేసులు 27 శాతానికి పడిపోగా.. 73 శాతం ఒమిక్రాన్  కేసులున్నట్లు వెల్లడించింది. మరోపక్క గత వారం వ్యవధిలో సగటున రోజుకు 1,90,000 కేసులు నమోదైనట్లు జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ కేసుల పెరుగుదలపై యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆదివారం మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అసాధారణ అంటువ్యాధి అంటూ హెచ్చరించారు. అందుకు తగ్గట్టే ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. అలాగే దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లో వెల్లడైన అధ్యయనాలను బట్టి.. మిగతా వేరియంట్లతో పోలిస్తే, ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరిక, అక్కడ ఉండాల్సిన వ్యవధి, బాధితులకు ఆక్సిజన్‌ అవసరం తక్కువగా ఉందని తెలియజేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని