
omicron: నైజీరియాలో అక్టోబర్‌లోనే ఒమిక్రాన్ కేసులు!
అబూజ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై దక్షిణాఫ్రికా నవంబర్ 24న ప్రపంచానికి సమాచారం అందించింది. అయితే, గత అక్టోబర్‌లోనే ఈ వైరస్ వ్యాప్తి మొదలైనట్లు తాజాగా వెల్లడైంది. ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా గుర్తించేందుకు కొన్ని వారాల ముందే.. తాము సేకరించిన నమూనాలో ఈ వేరియంట్ నిర్ధరణ అయినట్లు నైజీరియా తాజాగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నమూనాలు సేకరించి పరీక్షించగా ఈ వేరియంట్ నిర్ధరణ అయినట్లు నైజీరియా ప్రజారోగ్య సంస్థ (సీడీసీ) బుధవారం వెల్లడించింది. మొత్తంగా ఇద్దరికి ఈ వైరస్ నిర్ధరణ అయిందని తెలిపింది.
తాము ఒమిక్రాన్‌ను ముందే గుర్తించినట్లు నెదర్లాండ్స్ సైతం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలో ఒమిక్రాన్ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్ వెల్లడించింది. నవంబర్ 24న కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో 19 నుంచి 23 మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించినట్టు నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో తొలి కేసు
ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించినట్లు సౌదీ అరేబియా తాజాగా వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తితో పాటు ఆయన సన్నిహితులను క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లయింది. ఇప్పటి వరకు సుమారు 20 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.