Night Curfew : కర్ణాటకలో పది రోజులపాటు రాత్రి కర్ఫ్యూ

ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Updated : 26 Dec 2021 13:52 IST


బెంగళూరు : ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 28 నుంచి 10 రోజులపాటు.. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ  కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు.

రాత్రి కర్ఫ్యూతోపాటు న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ప్రజలు గుమిగూడటం, డీజేలతో పార్టీలు చేసుకోవడం లాంటి వాటిపై పూర్తిగా నిషేధం విధించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో మాత్రమే హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు నిర్వహించుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇక కర్ణాటకలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 32కు చేరింది. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఒక వ్యక్తి (60)కి ఒమిక్రాన్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల నివేదికలో నిన్న తేలింది.

మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు కర్ఫ్యూ, ఇతర నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని