Published : 05 Sep 2021 22:25 IST

Nipah virus: కేరళను కలవరపెడుతోన్న నిఫా.. మరో ఇద్దరిలో లక్షణాలు!

తిరువనంతపురం: ఇప్పటికే కరోనా వైరస్‌ మహమ్మారితో వణికిపోతున్న కేరళను నిఫా వైరస్‌ కూడా కలవరపెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ సోకి ఇప్పటికే ఓ బాలుడు మృతి చెందగా.. తాజాగా మరో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిఫా లక్షణాలు గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు బాలుడికి సన్నిహితంగా మెలిగిన వారిని 20 మంది హై రిస్క్‌ కాంటాక్టులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్యశాఖ పేర్కొంది.

‘12ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌తోనే మరణించినట్లు నిర్ధారించాం. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టాం. ఇప్పటివరకు 188 కాంటాక్టులను గుర్తించగా వారిలో 20మంది హైరిస్క్‌ ఉన్నట్లు కనుగొన్నాం. వారిలో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిఫా లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒకరు ప్రైవేటు ఆస్పత్రివారు కాగా.. మరొకరు కోళికోడ్‌ మెడికల్‌ కాలేజీ సిబ్బంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థకు చెందిన బృందంతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం’ అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. నిఫా వైరస్‌ విజృంభణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆమె.. ప్రస్తుతం హై రిస్క్‌ కాంటాక్టులందర్నీ ఐసోలేషన్‌లో ఉండమని ఆదేశించినట్లు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా బాలుడు నివాసమున్న ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు. అయితే, కొవిడ్‌ విజృంభణ కారణంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడంతో నిఫా వల్ల ఆందోళన అక్కర్లేదని మంత్రి వీణా జార్జ్‌ అభిప్రాయపడ్డారు.

కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మొత్తం 18 కేసులు నిర్ధారణ కాగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది జూన్‌ 10 నాటికి వైరస్‌ కట్టడి చేసినట్లు ప్రకటించారు. కానీ, 2019లో మరోసారి ఒకరిలో నిఫా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. తాజాగా మరోసారి బయటపడగా ఇప్పటికే ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు దేశంలో ఐదోసారి నిఫా వెలుగు చూడగా.. కేరళలోనే మూడుసార్లు బయటపడింది.

దిలా ఉంటే, ఓవైపు కొవిడ్ కొవిడ్‌-19తో కేరళ రాష్ట్రం వణికిపోతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 70 శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. నిత్యం దాదాపు అక్కడ 30వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ప్రాణాంతక నిఫా వైరస్‌ విజృంభించడం ఆందోళనకు గురిచేస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని