
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్‌లో లేవ్!
అయినా అప్రమత్తంగానే ఉన్నాం - కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో యావత్ ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల నేపథ్యంలో దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించగా.. మరికొన్ని దేశాలు కొవిడ్ కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి. ఈ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొత్త వేరియంట్లపై ‘ఇన్సాకోగ్’ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని పేర్కొంది.
ఇంతవరకూ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయినా దేశంలో కొత్త వేరియంట్‌ల దాఖలాలు.. వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారి నమూనాల జన్యు విశ్లేషణను కూడా వేగవంతం చేసినట్లు తెలిపింది.
ఇలా ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ.. ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలను ఇప్పటికే ముప్పు దేశాల జాబితాలో భారత్ చేర్చింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాలను ప్రమాద ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఇప్పటికే నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు కూడా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించింది. వీటితోపాటు కొవిడ్ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణపైనా సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలా ప్రమాదకరంగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.